Monday, March 19, 2012

నవగ్రహాలు యెన్ని? అవి యేవి?

ఈ ప్రశ్న వింతగా అనిపిస్తుంది.

పంచపాండవు లెంతమంది అని అడిగితే నాలుగు అని చెప్పి ఒక మానవుడు మూడు వేళ్ళు చూపించాడని హాస్యోక్తి చెప్పుతుంటారు.  అందు చేత పంచపాండవు లెంతమంది అని అడిగితే యెవరైనా మనం ఆటపట్టించటానికే అడిగామనుకుంటారు గాని మనం నిజంగా ప్రశ్నిస్తున్నామని అనుకోరు.

అలాగే నవగ్రహాలు యెన్ని అంటే ప్రతివారూ మనం హాస్యానికే అడుగుతున్నామనుకుంటారు.
కాని నిజంగానే యీ ప్రశ్నకు జవాబు చెప్పుకోవలసి ఉంది.  అందుకే ప్రస్తావిస్తున్నది.

చాలా ప్రసిద్ధమైన నవగ్రహధ్యానశ్లోకం ఒకటి ఉన్నది.

        ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
        గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

ఇక్కడ లెక్కించిన తొమ్మదీ సూర్యచంద్రులూ, రాహుకేతువులూ,  కుజుడూ, బుధుడూ, గురు, శుక్ర శని గ్రహాలూ.  ఈ ధ్యానశ్లోకం వెంబడి వీటి అన్నింటిపైన విడివిడిగా ధ్యానశ్లోకాలు చెప్పి నవగ్రహస్తోత్రం పూర్తి చేసారు దీనిని కూర్చిన వారు. తమాషా యేమిటంటే ఈ స్తోత్రంలో యెక్కడా వీటిని గ్రహాలుగా సంబోధించలేదు. అయినా మనకు ధ్యానశ్లోకాలతో పనీలేదు వాటిని దేనికీ ప్రమాణంగా ఇక్కడ చెప్పటమూ లేదు.  ఈ ధ్యానాలు జపాలకు చెందిని స్తోత్రాలతో జ్యోతిషానికి యే సంబంధమూ లేదు గూడా.

సాంప్రదాయిక జ్యోతిశ్శాస్త్రంలో కూడా ఈ తొమ్మిదింటినీ కలగలిపి నవగ్రహాలని పిలవటం పరిపాటి.

సరిగా ఇక్కడే హేతువాదులు జ్యోతిషాన్ని తప్పుపట్టటానికి అభ్యంతరం చెబుతారు. సూర్యుడూ చంద్రుడూ గ్రహాలు కావనీ, రాహుకేతువులనే గ్రహాలేవీ లేవనీ  జ్యోతిష్కులకు తెలియదనీ, అటువంటి వాటి గురించి బోధించే శాస్త్రం తప్పనీ, ఆ శాస్త్రం పట్టుకు వేళ్ళాడే వాళ్ళు అయితే అజ్ఞానులు కాకపోతే మోసగాళ్ళూ అని.  అంత ఘోరమైన తొందరపాటు అవసరం లేదు హేతువాదులకూ భౌతికశాస్త్రవాదులకూ.  సూర్యుడూ చంద్రుడూ గ్రహాలు కావనీ, రాహుకేతువులనే భౌతికగ్రహాలేవీ లేవనీ   జ్యోతిశ్శాస్త్రానికీ,  జ్యోతిష్కులకు చక్కగా తెలుసు.  వాళ్ళకు భూమి సూర్యుడిచుట్టూ తిరుగుతోందనే కాదు, సంవత్సరప్రమాణమూ, దానిలో క్రమానుగతంగా వచ్చేమార్పులూ గురించి కూడా తెలుసు. రాహుకేతువులు అనేవి రాశిచక్రంపైని ఉహాబిందువులనీ వాటి ఉనికీ చలనాలగురించీ క్షుణ్ణంగా తెలుసు.

అయితే జాతకచక్రాల్లో అన్నిటిని గ్రహశబ్దంతో సంబోధించటంతో వచ్చిన చిక్కు సామాన్యులను తికమక పెట్టే మాట వాస్తవమే కాని, అది జ్యోతిశ్శాస్త్రాన్నీ,  జ్యోతిష్కులనూ యేమీ ఇబ్బంది పెట్టలేదు.  ఆధునిక శాస్త్రజ్ఞానం కలవాళ్ళమనుకునే వారు తికమక పడి నింద చేయటం అనవసరం అన్నమాట.

ఏతా వాతా తేలిందేమిటంటె నవగ్రహాలలో నికరమైన గ్రహాలు అయిదే (మంగళ, బుధ, గురు, శుక్ర, శని) గ్రహాలు.  ఈ అయిదింటిని సాంప్రదాయిక జ్యోతిషంలో పంచతారాగ్రహాలు అంటారు.  మళ్ళీ 'తారా' అన్నమాట పట్టుకుని వీటిని నక్షత్రాలని పొరబడ్డారని మరొక వాదం చేయకండేం!

సరే సాంప్రదాయిక జ్యోతిషంలో నవగ్రహాలు తొమ్మిది కాదని తేలింది.
ఏడ్చినట్లుంది!
మరి ఆధునిక ఖగోళశాస్త్రంలోనైనా నవగ్రహాల సంఖ్య తొమ్మిదేనా?
అదీ చూద్దాం.

చిన్నప్పుడు సైన్సుపాఠాలలో చదువుకొన్న లిష్టు ఒక సారి తిరగేద్దాం.

బుధుడు, శుక్రుడు, భూమి,
అంగారకుడు, గురుడు, శని,
యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో

ఇదే కదా మనం చదువుకొన్న నవగ్రహాల జాబితా.
ఇవేనా నవగ్రహాలు?

అవును ఇవే నవగ్రహాలు మొన్నమొన్నటిదాకా!  కాని యీ మధ్యే వీటి జాబితా సవరించారు.
ఇప్పుడు ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు.  అందుచేత ప్రస్తుతం గ్రహాలు యెనిమిదే.

1977లో కైరాన్ (Chiron) అనే ఒక్ చిన్న గ్రహాన్ని ప్లూటో ఆవల కనుగొన్నప్పటినుండీ ప్లూటో యొక్క గ్రహత్వహోదాపై నీలినీడలు మొదలయ్యాయి. ప్లూటోతక్కువ ద్రవ్యరాశిని కలిగిఉండటం పైగా సౌరకుటుంబంలో సుదూరాన అటువంటి చిన్నచిన్న గ్రహాలు కానరావటంతో  ప్లూటో ప్రభ తగ్గింది. దానికి తోడు 2005లో ప్లూటో కన్నా  27%యెక్కువ ద్రవ్యరాశిగల ఈరిస్ (Etis)  కనుగొనబడింది. 

2006 ఆగష్టు 24న అంతర్జాతీయ ఖగోళశాస్త్రసంస్థ  గ్రహం అనేదానిని పునర్నిర్వచించింది. దాని ప్రకారం సూర్యుడి చుట్టూ తిరిగటం,  దాదాపు చక్కని గోళాకృతి కలిగి ఉండటం,  తన చుట్టుపట్ల తనతో తులతూగే గురుత్వాకర్షణ బలం కల మరేదీ సమీపంలో లేకపోవటం అనే మూడు లక్షణాలూ ఉంటే తప్ప ఇక గ్రహం కాదు.  దానితో ప్లూటో గ్రహంగా అనుభవిస్తున్న హోదా కాస్తా కోల్పోయింది - ఎందుకంటె ప్లూటో సమీపంలో క్యూపర్ బెల్ట్ చిన్నా చితకా గ్రహశకలాలతో సందడిగా ఉంది.

అందుచేత మనం చదువుకున్న ఆధునిక శాస్త్ర  నవగ్రహాలు కేవల యెనిమిదే.

చివరికి తేలిందేమిటి?
నవగ్రహాలు అనేది కేవలం ఒక వాడుక మాట.
ఆధునిక శాస్త్రం ఒక గ్రహాన్ని యీ మధ్యే తగ్గించింది.
సాంప్రదాయ జ్యోతిషంలో నవగ్రహాలలో నిజానికి అయిదే గ్రహాలు.

ఇదీ నవగ్రహాలు అన్నమాట వెనుక విషయం.

3 comments:

  1. నాకు తెలిసినంతవరకు: రాహు కేతువులు చాయా గ్రహాలు. వాటికి భౌతికమైన స్థానాలు లేవు. వాటియొక్క స్థానాలు గుణింపబడినవై ఉంటాయి (calculated points in the sky). బహుశః అవి భూమి మరియు చంద్రుని ఛాయ/నీడల్లో ఉండి ఉండాలి.

    భూ/చంద్రుల నీడల గమన మార్గాలను అంతరిక్షంలో గీయటం ఒక ఆసక్తికరమైన పరిశోధన. నాకు అంతగా ఈ విషయంలో ప్రావీణ్యత లేదు గానీ, జ్యోతిశశాస్త్రం లోని రాహుకేతువుల నడకలను ఈ చాయా బిందువుల నడకలతో పోల్చి చూడాలని నా ఉద్దేశ్యం.

    ఇక, నేను ఈమధ్యే విన్న మరొక విశేషం: "జ్యోతిష" అనగా "వెలుగుతున్న" లేదా "వెలిగే" "ఖ" (అంతరిక్ష) గోళములు.

    ReplyDelete
  2. స్వాగతం.
    రాహుకేతువుల గురించి విడిగా ఒక వ్యాసంలో వివరిస్తానండీ.
    ఈ రాహుకేవువులు రాశి చక్రంపైన బిందువులు. వాటి స్థానాలను గణితం ద్వారా కనుగొనటం జరుగుతుంది.
    జ్యోతులు అంటే ప్రముఖంగా సూర్యచంద్రులే. వారి ఆధారంగానే కాలగణనం చేస్తాము. ఆసలు జ్యోతిశ్శాస్త్రమని యెందుకంటామో కూడా చర్చించటం మంచిదే. అది మరొక వ్యాసమన్నమాట.
    సాధ్యమైనంత సులభశైలిలో వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.

    ReplyDelete
  3. సుర్య సిద్ధాంత గ్రంధ ఆధారముగా వార క్రమము ఏర్పడు విధానము
    శ్లొ|| మందమారేజ్య భూపుత్ర సూర్య శుక్రేందుజేందవ్:
    మదాదధ: క్రమేణస్యు: చతుర్థా దివసాధిపా:||
    అన్ని కక్ష్యలకంటే పైన నక్షత్ర కక్ష్య దానితరువాత శని కక్ష్య.
    ఆ శని కక్ష్య నుండి నాల్గవ కక్ష్య సుర్య కక్ష్య కాబట్టి మొదటి వారం సుర్య(ఆది)వారము, సుర్యునికి నాల్గవ కక్ష్య చంద్ర కక్ష్య కాబట్టి రెండవ వారం చంద్ర(సోమ)వారము, చంద్రునికి నాల్గవ కక్ష్య కుజ కక్ష్య కాబట్టి మూడవ వారం కుజ(మంగళ)వారము, కుజునికి నాల్గవ కక్ష్య బుధ కక్ష్య కాబట్టి నాల్గవ వారం బుధవారము, బుధునికి నాల్గవ కక్ష్య గురు కక్ష్య కాబట్టి ఐదవ వారం గురువారము, గురునికి నాల్గవ కక్ష్య షుక్ర కక్ష్య కాబట్టి ఆరవ వారం శుక్ర(భృగు)వారము, శుకృనికినికి నాల్గవ కక్ష్య శని కక్ష్య కాబట్టి ఏడవ వారం శని(మంద)వారము.
    ఈ క్రమముగా వారములు ఏర్పడినవి. కాబట్టి శాస్త్రాధారము వలన ఏడు గ్రహములే అని తెలుస్తున్నది

    ReplyDelete

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!