Wednesday, March 28, 2012

ప్రాచీనభారత మహోన్నత గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట మహాశయుడు - 1

ముందుగా ఒక విషయం.  చాలామంది పొరపడుతున్నట్లు ఈయన పేరు ఆర్యభట్టు కాదు.  సరైన గుణింతం ఆర్యభట  అనే.   బ్రహ్మగుప్తాదులు 'ఆర్యభట' అనే పిలచారు. కాని యెలా పిలచినా పెద్ద ఇబ్బంది లేదు.

క్రీ.శ. 476లో జన్మించిన ఆర్యభట తన ఆర్యభటీయంను క్రీ.శ. 499లో సంపుటం చేసినట్లు నిర్థారణ అవుతున్నది.   ఆర్యభట క్రీ.శ. 550 వరకు జీవించినట్లు తెలుస్తోంది. ఆర్యభటీయంను కలియుగం 3630వ సంవత్సరంలో   రచించినట్లు యీయన చెప్పుకున్నారు.  (నిజానికి ఈ గ్రంధానికి యీయన పెట్టినపేరు  యేమీ కనబడదు. ఆర్యభటీయమని తరువాత పేరు వచ్చింది దానికి. )అప్పటికి తన వయస్సు 23 సంవత్సరాలనీ చెప్పటం జరిగింది అందులో.

ఈ ఆర్యభటీయం ఒక అద్భుతమైన గణిత, ఖగోళ శాస్త్ర విజ్ఞానఖనియైన గ్రంధం.   ఈ గ్రంధంలో అంకగణితం (arithmetic), బీజగణితం(algebra),  త్రికోణమితి (trigonometry),  గోళీయ త్రికోణమితి (spherical trigonometry) ,  వర్గసమీకరణాలు(quadratic equations),  శ్రేణీసంకలనం(sums-of-power series),   జ్యావిలువల-పట్టికలు(table of sines) మొదలైన గణితవిభాగాలు ఉన్నాయి. 

ఆర్యభట జన్మస్థలం నేటి బీహారు రాష్త్రం.  ఈయన పాటలీపుత్రంలోని నలందా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసాడు.  అప్పట్లో పాటలీపుత్రాన్ని కుసుమపురం అని పిలచేవారు. ప్రస్తుతం పాటలీపుత్రాన్ని మనం పాట్నా అని పిలుస్తున్నాం.  అనంతరకాలంలో యీయన కుసుమపురంలోని నక్ష్యత్ర్యపరిశోధనాశాలకు అధిపతికూడా అయినట్లూ,  తన జన్మస్థలం అయిన బీహారులోకూడా ఒక నక్ష్యత్ర్యపరిశోధనాశాలను నిర్మించినట్లూ భావిస్తున్నారు.

ప్రాచీనసూర్యసిధ్ధాంతం ఆధారంగా  ఆర్యసిధ్ధాంతమనే ఖగోళశాస్త్రగ్రంధాన్ని కూడా ఆర్యభట రచించినట్లు ఆయన సమకాలీకుడైన వరాహమిహిరుడి రచనలద్వారానూ, ఆతరువాతికాలంవారైన బ్రహ్మగుప్తుడు,  మొదటి భాస్కరాచార్యులు మొదలౌన  వారి ఉటంకింపుల ద్వారానూ తెలుస్తున్నది. కాని ఇప్పుడు అది అలభ్యం.  ఖగోళపరిశోధనకు ఉపయోగించే శంఖుయంత్రం, ఛాయాయంత్రం, ధనుర్యంత్రం, చక్రయంత్రం , యష్టియంత్రం  వగైరా పరికరాలగురించీ,  కాలగణనానికి ఉపయోగించే నీటితో నడిచే గడియారాల గురించీ యీ గ్రంధంలో ఆర్యభట వివరించాడట.   అల్-బిరూనీ అనే పర్షియాదేశపు విద్వాంసుడు ఆర్యభట గ్రంధపు ప్రతిని అరబిక్ భాషలోనికి తర్జుమా చేసాడు.

ఆర్యభటీయాన్ని మొదటి భాస్కరాచార్యులు ఆశ్మకతంత్రం అని వ్యవహరించాడు.  ఈ గ్రంఢానికి ఆర్యశతాష్ట అనే పేరు కూడా ఉంది. ఈ గ్రంధం నాలుగు పాదాలుగా విభజించబడి, 108 శ్లోకాలు కలిగి ఉంది. మరొక 13 ఉపోద్ఘాత శ్లోకాలూ ఉన్నాయి.

మొదటిదైన  గీతికాపాదంలో  13 శ్లోకాలున్నాయి.  ఇందులో కల్ప, మన్వంతర, యుగాదుల కాలప్రమాణాదులూ, జ్యావిలువల గురించిన శ్లోకమూ ఉన్నాయి. మహాయుగప్రమాణం43,20,000 సంవత్సరాలని చెప్పబడింది.

రెండవదైన గణితపాదంలో 33శ్లోకాలున్నాయి.  ఇందులో  శ్రేణుల (arithmetic and geometric progressions) గురించీ , శంఖుఛాయాది యంత్రాలగురించీ,  అనిర్ధిష్టసమీకరణాలు (indeterminate equations) గురించీ ఉంది.

మూడవదైన కాలక్రియాపాదంలో 25శ్లోకాల్లో,  వివిధకాలప్రమాణాలూ,  గ్రహస్థితులను గణనం చేసేవిధానమూ, అదిక-క్షయ మాసాదిగణనమూ ,  వారాల పేర్లూ వగైరా ఉన్నాయి.

నాల్గవపాదమైన గోళపాదంలో 50శ్లోకాలున్నాయి.  దీనిలో,  ఖగోళం గురించీ,  త్రికోణమితీ,  భూమి ఆకృతి, విశ్వంలో దాని ఉనికీ,  క్షితిజమూ,  రాహుకేతువులనే బిందువులూ,  దివారాత్రలు యేర్పడే విదానమూ వాటి దైర్ఘ్యాది ప్రమాణాలూ వగైరా విపులంగా ఉన్నాయి.

ఈ ఆర్యభటీయంలో ఉన్న అనేక వినూత్నమైన గణితసిద్ధాంతాలు శతాబ్దాలపాటు ప్రభావాన్ని చూపాయి.

2 comments:

  1. Dhanyavaadaalandee, for your efforts knowledge sharing. Please keep up the good work, I am sure there will be many like me who are following your blog and enlightening themselves. Thanks.

    ReplyDelete
  2. శ్రీదేవి గారూ, జ్యోతిశ్శాస్త్రం బ్లాగుకు స్వాగతం.
    నేను సేకరించి ఇక్కడ పొందుపరుస్తున్న విషయాలు మీకు నచ్చటం సంతోషం కలిగించింది.
    ఇదంతా నాకోసమూ, మీ అందరి కోసమూ కూడా.
    హేతవాది బ్లాగులో ఒక వ్యాఖ్యాత, ఆయనకేమి తెలుసునో మరి, ఆర్యభట్టూ, వరాహమిహిరుడూ భాస్కరాచార్యులూ మొదలైన వాళ్ళంతా విషయం కప్పిపెట్టి మోసగించారు జనాన్నిఅని వ్రాయటం విచారం కలిగించింది. వీరందరూ ఆయననేమి మోసగించారో మరి. అందుచేత మొదట వీరిని గురించి పరిచయం చేద్దాం యీ బ్లాగులో అనిపించి వ్రాస్తున్నాను.

    ReplyDelete

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!