Friday, January 25, 2013

వింశోత్తరీ దశాగణనం

జ్యోతిశ్శాస్త్రంలో ప్రవేశం ఉన్న వాళ్ళలో ఇంచుమించు అందరకూ ఈ వింశోత్తరీ దశావిధానం బాగా పరిచయం ఉండే ఉంటుంది.   అయినా సమగ్రత కోసమూ, యెవరైనా ఆట్టే పరిచయం లేని వాళ్ళుంటే యెక్కడన్నా ఉంటే వాళ్ళ కోసమూ  ఈ వింశోత్తరీ దశావిధానంగురించి పరిచయం చేస్తున్నాను.

ఈ వింశోత్తరీ దశావిధానంలో రాహుకేతువులతో సహా పీఠిక (రాశి చక్రం) పైన ఉన్న అన్ని గ్రహాలకూ నిర్దిష్టమైన సంవత్సరాల కాలం ముందే స్థిరంగా నిర్ణయించబడి ఉన్నది.  వాటిని పట్టిక రూపంలో‌  క్రింద చూడవచ్చును.


గ్రహం దశా సంవత్సరాలు
రవి 6
చంద్రుడు 10
కుజుడు 7
రాహువు 18
గురుడు 16
శని 19
బుధుడు 17
కేతువు 7
శుక్రుడు 20


ఇప్పుడు మీరు ఈ‌గ్రహదశల కాలపరిమితులు మొత్తం కూడితే 120 సంవత్సరాలుగా వస్తుంది. అందుచేత 120 సంవత్సరాలు అనేది పూర్ణాయువుగా తీసుకోవటం సంప్రదాయంగా యేర్పడింది. సాధారణంగా యెవరూ అంతకాలం వరకూ బ్రతుకరు. ఒక వేళ బ్రతికి ఉంటే, మరొక చక్రం విశోత్తరీ‌దశలు పునరావృతం అవుతాయి.

ఇంకొక విశేషం యేమిటంటే వింశోత్తరీ‌దశాచక్రంలో గ్రహాల వరస కొంచెం విచిత్రంగా ఉన్నది.

ఇక గ్రహదశలు గణించే విధానం చంద్రుడి స్థితి మీద ఆథారపడి ఉంటుంది.  ఏ రెండు పీఠికలలో నయినా చంద్రస్థితి సమంగా ఉంటే దశల అమరిక కూడా అంతే - సరిసమానంగానే ఉంటుంది.   పీఠిక మీద చంద్రుడు యే నక్షత్రం పైన ఉన్నడనేదానిపైన మొదటి దశ యేమిటో తెలుస్తుంది. 

 దీనికి ఆథారమైన శ్లోకం

    ఇన శశి కుజ రాహుః జీవ మందజ్ఞ కేతుః
    భృగుజ ఇతి నవానాం కృత్తికాది క్రమేణ

ప్రతి నక్ష్యత్రానికి అదిదైవతాగ్రహాల చిట్టా చూస్తే యీ‌క్రింది పట్టిక లో చూపిన విధంగా ఉంటుంది.

 
నక్ష్యత్రం నక్ష్యత్రం నక్ష్యత్రం అధిపతి
కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవి
రోహిణి హస్త శ్రవణం చంద్రుడు
మృగశిర చిత్త ధనిష్ట కుజుడు
ఆరుద్ర స్వాతి శతభిష రాహువు
పునర్వసు విశాఖ పూర్వాభాద్ర గురుడు
పుష్యమి అనూరాధ ఉత్తరాభాద్ర శని
ఆశ్లేష జ్యేష్ట రేవతి బుధుడు
మఖ మూల అశ్వని కేతువు
పుబ్బ పూర్వాషాఢ భరణి శుక్రుడు


ఇలా చంద్రుడు  పీఠీక మీద యే నక్షత్రంలో ఉన్నాడో ప్రారంభదశ ఆ‌గ్రహానిది అవుతుంది. ఉదాహరాణకు పీఠిక మీద చంద్రుడు హస్తా నక్షత్రగతుడై ఉంటే మొదటిదశ చంద్ర దశ అవుతుంది. చంద్రుడు ప్రస్తుత నక్షత్రంలో యెంతభాగం గతించి ఉన్నాడో అంత భాగం దశ కూడా గతించి నట్లుగా లెక్క వేయాలి. పీఠికాకాలం నుండి మిగతా దశాశేషం భోగ్యభాగం. ఆ తరువాత వచ్చే దశ తర్వాతి గ్రహానిది. హస్తానక్షత్రజాతకానికి చంద్రదశ ప్రారంభంలో ఉంటుంది, తరువాతి దశ కుజుడిది అన్న మాట.

స్థూలంగా ఇదీ వింశోత్తరి. అయితే దీనికి పునః పునః విబాగాలు చేయటం జరిగింది. వింశోత్తరీ దశను మహర్దశ అనీ దానిని మరలా వింశోత్తరీ‌క్రమంలో 120 భాగాఅలు చేసి దశాగణనంతో అంతర్దశలనీ లెక్కంచటం సంప్రదాయం.  ప్రతీ మహర్దశా తన అంతర్దశతోనే మొదలవుతుంది.

ప్రస్తుతానికి మనకు యింతకంటే సాంప్రదాయిక వింశోత్తరీ దశాగణనం గురించి వివరం అవుసరం లేదు.

వింశోత్తరీ‌దశాగణనంలోని మఖ్యమైన విషయం యేమిటంటే దశాగననం కేవలం చంద్రుని స్థితి ఆధారంగానే జరుగుతుంది. మిగతా గ్రహాలతో సంబంధం యేమీ లేదు. అయితే అంతర్దశల దగ్గరకు వచ్చే సరికి దశాధిపతీ అంతర్దశాధిపతీ వేర్వేరు గ్రహాలు కావటం సామాన్యం అయిపోతుంది. ఇంకా సూక్ష్మదశలను లెక్కిస్తే మరింతమంది గ్రహాలతో సంబంధం యేర్పడుతుంది.

వింశోత్తరీ దశలోని ఈ క్రింది విశేషాలు కూడా గమనించదగ్గవి.

మొదటిది గ్రహాలకు దశాసంవత్సరాలకూ యేమీ సంబందం లేదు. ఇవి కేవలం ఊహా‌జనిత సంఖ్యల లాగు కనిపిస్తున్నాయి.

రెండవది, దశాంతర్దశలతో గ్రహాల మధ్య బాంధ్వ్యం సృజించుకూంటున్నాము కానీ ఆ విధమైన బాంధవ్యం కృతమైనదిగా‌ తోస్తున్నది.

మూడవది దశాపరిమాణం 120సంవత్సరాలు.  ఈ‌ 120 సంఖ్యను బట్టి అదే పూర్ణాయుర్ధాయమన్నదీ, పూర్ణాయుర్దాయం వేరే కారణాలవలన 120 సంవత్సరాలయితే ఆ 120ని యిక్కడ వింశోత్తరీలో వాడుకున్నదీ అస్పష్టం.

నాల్గవది,  వింశోత్తరీదశలను కేవలం చంద్రుడికే యెందుకు అన్వయిస్తున్నామన్నది. దీనికి సరైన జవాబు లేనే లేదు.
నిజానికి వింశోత్తరీదశలను అన్ని గ్రహాలనుండీ గణించి ఇష్టకాలంలో దశలమధ్య సంబంధాలు బేరీజు వేసి ఫలితాలు చెప్పాలని ప్రయత్నించవచ్చును.  ఇది పరిశోధించవలసిన విషయం

ఈ ప్రశ్నలకు సమాదానంగా నేనుకొంత పరిశోధన చేయటం జరిగింది.
దాని గురించి తదుపరి టపాలో చూడవచ్చును.

No comments:

Post a Comment

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!