Friday, January 25, 2013

వింశోత్తరీ చర దశలు

ఇక్కడ నేను వింశోత్తరీ దశలకు ఒక క్రొత్త విధానాన్ని ప్రతిపాదిస్తున్నాను.

సాంప్రదాయిక వింశోత్తరీ విధానాన్ని వింశోత్తరీ స్థిరదశలుగాను, నూతన విధానాన్ని వింశోత్తరీ చర దశలు గానూ వ్యవహరించటం జరుగుతుంది ఇకమీద. దీని వలన అనవసరమైన గందరగోళం తలయెత్తకుండా నివారించబడుతుంది.

వింశోత్తరీ స్థిర దశావిధానంలో 9 నక్షత్రాలకు కలిపి 120  సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నాము. ఇక్కడ కొంచెం గణితం చేద్దాము. అసలు పీఠిక మీద ఉండేవి 27  నక్షత్రాలు కదా? మరి తొమ్మిదేసి నక్షత్రాలు చొప్పున మొత్తం మూడు ఆవృతులుగా విభజించతం వెనుక మరేదైనా ఉద్దేశం దాగున్నదా అనేది చూద్దాం.  ౩ ఆవృతులకు కలిపి మొత్తం గా 3 x 120 = 360 అనే సంఖ్య వస్తున్నది.

సంవత్సరానికి మనకు సాంప్రదాయికంగా 360 తిధులు. ఇందులో యేవిధమైన అనుమానం యెవరికీ ఉండదనుకుంటాను.

ఈ 360 అనే తిధి సంఖ్యతో యేర్పడే సంవత్సరాన్ని వింశోత్తరీ దశా త్రిరావృతి కలన రూపమైన  360తో ముడి పెడదాము.  ఇదే నా క్రొత్త విధానంలోని కీలకాంశం.

ఇలా చేస్తే,  అన్ని నక్షత్రాలకూ‌ కలిపి వింశోత్తరీ విధానం యొక్క సంకలన ఫలం ఒక సంవత్సరం అవుతున్నది.
ఇలా సాదించిన ఫలితం తీసుకుని మనం గ్రహాలకు ముడి పెట్టే ప్రయత్నం సులభంగా చేయవచ్చును.

మనం స్థిరగ్రహం మరియు చరగ్రహం అనే పరిభాషను ప్రవేశ పెట్తటంద్వారా క్రొత్త ప్రతిపాదనలు చేద్దాం.

స్థిరగ్రహం అంటే పీఠికపైన ఉన్న గ్రహం.  దాని స్థానం పీఠిక మీద మారదు. కాబట్టి మనం దాన్ని స్థిరగ్రహం అందాం.
చరగ్రహం అంటె నూతన దశా విధానం ద్వారా స్థిరగ్రహ స్థానం నుండి మొదలు పెట్టి క్రమంగా పీఠిక మీద సంచరించే గ్రహం.

సిథ్థాంత ప్రతిపాదన యేమిటంటె ప్రతి చర గ్రహం యొక్క ఇష్ట నక్షత్రస్థితి దశాకాల ప్రమాణం దాని దశాసంఖ్యాప్రమాణాన్ని అది ఉండిన నక్షత్రం యొక్క దశాసంఖ్యాప్రమాణంతో గుణించగా వచ్చిన దినసంఖ్యాప్రమాణం అవుతుంది.

ఉదాహరణకు గురుడు పీఠీక మీద భరణీ నక్షత్రం ప్రారంభస్థానంలో ఉన్నాడనుకుందాం.
అలా ఉన్న గురుడు స్థిరగ్రహం.

చరగురుడు మొదట భరణిలోను, పిదప కృత్తికలోను అలా పీఠీక మీద భ్రమణం చేస్తూ ఉంటాడు.
మొదట చరగురుడు భరణిలో 16 x 20 = 320 దినాలు ఉంటాడు.
ఈ చరగురుడు పీఠీక మీద ఒక భ్రమణం పూర్తి చేయటానికి పట్టె కాలం  16 x 360 = 16 సంవత్సరాలు!

ఇలా మనం వింశోత్తరీ దశలోని సంఖ్యలకు మరింత సుష్టువైన అన్వయం సాధించాము!

వింశోత్తరీ చరదశలను పీఠిక మీది  ప్రతిగ్రహానికీ‌  పరిగణించాలి.

ఇలా‌చేయటం వలన పీఠీక మీద 9  స్థిర గ్రహాలూ, 9 చర గ్రహాలూ యెల్లప్పుడూ కనబడతాయి.

మనం వీటి మధ్య కల సంబంధాలను అవి యిచ్చే ఫలితాలనూ పరిశోధన చేయవలసి ఉంది.

ముఖ్యంగా యీ విధానంలో ప్రత్యేకించి అంతర్దశలూ విదశా విభాగాలూ యేమీ ఉండవు.

అత్యంత చిన్నది అయిన దశా కాలం రవి  స్వనక్షత్రంలో సంచరించే కాలం.  అది 6 x 6 = 36 రోజులు.
అత్యంత దీర్ఘం అయిన దశా కాలం శుక్రుడు స్వనక్షత్రంలో సంచరించే కాలం. అది  20 x 20 = 400 రోజులు.

ముఖ్యంగా మనం గమనించ వలసిన సంబంధాలు:
  1.  స్థిర చర  గ్రహ సంయోగాలూ, అభిముఖాది స్థితులూ, దృష్టులూ
  2.  చర గ్రహాలు శత్రు మిత్రాది క్షేత, నక్షత్రాదులలో సంచరించటం
  3. చర గ్రహాల దశల మధ్య సంబంధాలు.
ఒక చరగ్రహంమరొక స్థిరగ్రహంతో పూర్ణసంయోగస్థితి పొందటం ఒక జాతకంలో120 యేళ్లలో యెన్ని సార్లు జరుగుతుందన్న ప్రశ్న తీసుకుందాం.   120  సంవత్సరాలలో రవి  120 / 6 = 20 భ్రమణాలు చేస్తాడు. అంటె నవస్థిరగ్రహాలతోనూ  చరరవి ఒక్కొకరితో  20 సార్లు చొప్పున సంయోగం పొందుతాడు. అంటె మొత్తం  9 x 20 = 180 సంయోగ సంఘటనలు.  ఇలాగే  మిగిలిన గ్రహాలకూ లెక్కలు వేయాలి.  మొత్తం 98 పూర్ణబ్రమణాలు మరికొన్ని పాక్షికభ్రమణాలూ జరుగుతాయి.  అంటే మొత్త సంయోగాల సంఖ్య 98 x 9 = 882. నిజానికి యీ సంఖ్య చులాగ్గా 1000 కి చేరుతుంది పాక్షికబ్రమణాలనూ లెక్కలోకి తీసుకుంటే.  అంటే యేటా 8 దాకా స్థిరచర గ్రహ సంయోగాలు జరుగుతాయి.

మనం కేవలం‌ స్థిరచరగ్రహం సంయోగాలనే తీసుకుంటే ఇంత సంఖ్య వచ్చింది. కాని మనం‌ స్థిరచర గ్రహాల మధ్య ఇతర సంబంధాలనూ చూసుకుంటే ఇంచుమించు యేటా అనేక ఆసక్తికర ఘటనలు వీక్షించవచ్చును.

నిజానికి మనం వింశోత్తరీ చరదశలు గణించేటప్పుడు కేవలం నవగ్రహాలకే కాదు లగ్నానికీ చరబిందువును పరిగణించాలి.
అప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది.

అయితే చరదశాగణనం కొంచెం క్లిష్తంగా అనిపించవచ్చును.
ఈ గణనం సులభంగా చేసే విధానం వచ్చే టపాలో చూద్దాం.

No comments:

Post a Comment

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!